Sunday 11 December 2011

ప్రస్తావము


చారిత్రికవిశేషములను ఇతివృత్తముగాఁగైకొనిరమణీయమైన శైలిలో
 కావ్యములను నిర్మించుట-నవీన పద్ధతులలో హృద్యమైన యొక
ప్రకియ. ఆత్మకధలు-జీవితచరిత్రలు-జాతకచర్యలు, ఇట్టివన్నియు
ఈ శ్రేణిలోఁ జేరి-అప్పటి దేశకాల పరిస్థితులను సాంఘికముగా
సారస్వతముగా రాజకీయముగా లోకమునకుఁ దెలియజేయుచుండును.
ఆ గాధలు-ఆ చరిత్రలు రసవత్తర ఘట్టములుగా రాణించినచో - కాంతా
సమ్మితములై లోకమున కుపకరించును.

అది యొక ‘వీరపూజ’గాఁ గావించి అట్టిగాధలు జాతీయతాసౌధమునకుఁ
బునాదులుగా భావించి, భారతీయ వీరులలో అభివంద్యులైనవారి
నెందఱనో ఇందనుక తెలుగులో వర్ణించియుంటిని. ఆ జాతీయవీరులతో
నిత్యసాహచర్యము మనకు లేకున్నను, దేశములో - ఓతప్రోతములుగాఁ
బెనవేసికొన్న వారి జీవిత లీలలు పరంపరగా వినియు వ్రాతలలోఁ జవి
చూచియుఁ జిత్రించుటలో-ఒక సౌకర్య మున్నది.

ఇప్పటి యీ నా‘రచన’-అట్టిది కాదు. ఈ రచనకు-కధానాయకులు
శ్రీ‘వరదాచార్యులవారు’.

వయస్సులో వారు పెద్దలయ్యు-చారిత్రికముగా అస్మదాదులకు
సమకాలికులు; విశిష్య-మాకు ఆచార్యవర్యులు. అనుస్యూతమైన
వారి సాన్నిధ్యములోఁ జిరకాలము మెలగిన మాకు- ఇట్టి రచనలు
చేయుటలో అధికార మున్నదని గర్వింతుము.

కాని-అసిధారావ్రతముగాఁ గొంత ‘ఇఱుకాటము’గాఁగూడ ఉండక తప్పలేదు.
 ఆ యా పరిస్థితులను జిత్రించుటలో మమతాదోషములు పొరయకుండ-
అ౧‘తిశయోక్తులు దొరలకుండ-తిరస్కారములు కలగకుండ-మెలకువగా
‘బండి’న్నడుపవలసివచ్చినది. చరిత్రను దారుమాఱు చేయని ‘అతిశయోక్తు’
లొకవేళ కధాపురుషునిబట్టి కైకొన్నను దోషములేదు. కాని, కధను నడిపించుటలో నిర్దుష్టముగా నుండవలె ననియే నా దీక్ష.

ఈదీక్షతో నాకుఁ దోఁచిన త్రోవలో- ఈ రచన నడపించితిని. భాషావిషయముగా
రాజకీయముగా-ప్రాదేశికముగా వ్యక్తినిరూపణముగాఁ గొన్ని విశేషముల నిందు జిత్రించితిని. అప్పటి విశేషము లన్నియు సాకల్యముగా ఈ రచనలో ప్రతిబింప వలెనని నా మతము కాదు; కధానాయకుని విశేషములే ప్రధానముగా నాకుఁ గావలసినది. అయినను కధానాయకునిమూర్తిని 

బూర్తిగ నిందుఁ జిత్రించితి ననియుఁ గాదు; అదియు స్థాలీపులాకమే. ఒక విధముగా దిక్సూచియే.

ఉత్తమజీవితములు గల వ్యక్తులు సమకాలికుల సౌభాగ్యవిశేషములకు ప్రధాన
కారణమైనట్టులు-‘ఉత్తమ జీవిత చరిత్రలు’ ప్రజానీకమునకు ప్రాణప్రదము
లగుననియే నా భావము. ‘అతి పరిచయా దవజ్ఞా’ యన్నట్లు పెరటిలోని
కొన్ని మొక్కల విలువ మనకుఁదెలియకపోవచ్చును. ఎవ్వరేని యా విలువ
గుర్తించి వెలయించిననాడు- ఔనౌను నిజమేసుమా యని యౌడు గఱచి,
వేడుకగా విందుము.

వరదాచార్యులవారివంటి వ్యక్తులు మనకు దూరాన నున్నచో
దూరపుకొండలో నునుపు మనకుఁ దోచియే తీఱును. యావద్భారతము
మెచ్చుకోఁదగిన విశేషాంశము లాయనలో ఉన్నవనియు
సంస్కృతవాజ్మయ ముండునందాక-ఆయన ‘చిరంజీవి’గా
నుండుననియు సూత్రప్రాయముగా నాకు దోఁచుటయే ఈ రచన
కుపక్రమించితిని. ఇందు- ఆనుషంగితముగా అస్మదాదుల
చరిత్రయుఁ గొంతకుఁగొంత వచ్చుటలో హేతువు- ఆయన
జీవితములోని మెఱుఁగులను నిరూపించుటయేగాని వేఱుగాదు.

వారి సాహిత్యవ్యాసంగములు సన్నిధానవర్తులకే తెలియును.
వారి జీవితములోని మెఱుగులు పరితులకే-అర్ధమగును.
ఇవి యన్నియుఁ గొన్నేండ్లకు లోకములో కనుమఱుఁగై
కాలగర్భములోఁ గలసిపోవచ్చును. ఆయన కీర్తిమూర్తిని
గలకాలము స్థాపించి చూపించునది- ఆయన చేసిన
వాజ్మయసేవయే; ఆయన నిర్వహించిన కవితాధర్మమే.
అదియే ఆయన దివ్యజీవితములో మెఱుఁగైన భాగమని
యీచరిత్రలోఁ గొంతవఱకు నిరూపించితిని. ఆ భాగమున
కనుబంధముగా ముందువెనుకలు ముచ్చటించిన ఈ రచన
కూడ కలకాలము నిలిచియుండుననియే నా యాశ.
ఈ ‘యుభయము’ వలన వరదాచార్యులవారి దివ్యమూర్తి-
ఆచంద్రతారకప్రశస్తి గాంచి లోకమునకు వెలుఁగు
కూర్చునని యాశింతును.
                  -సత్యనారాయణ చౌదరి