Sunday 11 December 2011

‘కులపతి’ - శ్రీ వరదాచార్య జీవిత చిత్రణము


 Kulapati - Sri Varadacharya  jivita chitrana



కళాప్రపూర్ణ -పండిత 
కొత్త సత్యనారాయణ చౌదరి

Kalaprapurna - Pandita
Kotha Satyanarayana Chowdary

‘కులపతి’ - శ్రీ వరదాచార్య జీవిత చిత్రణము

‘కులపతి’ 
( శ్రీ వరదాచార్య జీవిత చిత్రణము)





 రచన - ‘కళాప్రపూర్ణ’ ‘పండిత’:
 కొత్త సత్యనారాయణ చౌదరి



గమనిక:
ఈ రచనపై సర్వహక్కులూ రచయత కుటుంబ సభ్యులకే  చెంది ఉన్నాయి.
ముందుగా వ్రాతపూర్వక అనుమతితో ఈరచనను
ఎవరైనను వినియోగించుకోవచ్చు.
(వ్యాపారానికి కాకుండా)
పునర్ ముద్రణ లో మూలరచనలో ఏమార్పుచేర్పులు
ఉండరాదు. ( గ్రాంధికభాష, భావము,` అరసున్న', `ఱ 'ఇత్యాదులను కూడ
యధాతధంగా ఉంచాలి.)

వివరాలకు........కమలాకరం కొత్త
kkkotha@yahoo.com





తొలి కూర్పు : 1000 ప్రతులు, 23-11-1969
శ్రీ సౌమ్య - కార్తీక - పూర్ణిమ - ఆదివారము

ప్రస్తావము


చారిత్రికవిశేషములను ఇతివృత్తముగాఁగైకొనిరమణీయమైన శైలిలో
 కావ్యములను నిర్మించుట-నవీన పద్ధతులలో హృద్యమైన యొక
ప్రకియ. ఆత్మకధలు-జీవితచరిత్రలు-జాతకచర్యలు, ఇట్టివన్నియు
ఈ శ్రేణిలోఁ జేరి-అప్పటి దేశకాల పరిస్థితులను సాంఘికముగా
సారస్వతముగా రాజకీయముగా లోకమునకుఁ దెలియజేయుచుండును.
ఆ గాధలు-ఆ చరిత్రలు రసవత్తర ఘట్టములుగా రాణించినచో - కాంతా
సమ్మితములై లోకమున కుపకరించును.

అది యొక ‘వీరపూజ’గాఁ గావించి అట్టిగాధలు జాతీయతాసౌధమునకుఁ
బునాదులుగా భావించి, భారతీయ వీరులలో అభివంద్యులైనవారి
నెందఱనో ఇందనుక తెలుగులో వర్ణించియుంటిని. ఆ జాతీయవీరులతో
నిత్యసాహచర్యము మనకు లేకున్నను, దేశములో - ఓతప్రోతములుగాఁ
బెనవేసికొన్న వారి జీవిత లీలలు పరంపరగా వినియు వ్రాతలలోఁ జవి
చూచియుఁ జిత్రించుటలో-ఒక సౌకర్య మున్నది.

ఇప్పటి యీ నా‘రచన’-అట్టిది కాదు. ఈ రచనకు-కధానాయకులు
శ్రీ‘వరదాచార్యులవారు’.

వయస్సులో వారు పెద్దలయ్యు-చారిత్రికముగా అస్మదాదులకు
సమకాలికులు; విశిష్య-మాకు ఆచార్యవర్యులు. అనుస్యూతమైన
వారి సాన్నిధ్యములోఁ జిరకాలము మెలగిన మాకు- ఇట్టి రచనలు
చేయుటలో అధికార మున్నదని గర్వింతుము.

కాని-అసిధారావ్రతముగాఁ గొంత ‘ఇఱుకాటము’గాఁగూడ ఉండక తప్పలేదు.
 ఆ యా పరిస్థితులను జిత్రించుటలో మమతాదోషములు పొరయకుండ-
అ౧‘తిశయోక్తులు దొరలకుండ-తిరస్కారములు కలగకుండ-మెలకువగా
‘బండి’న్నడుపవలసివచ్చినది. చరిత్రను దారుమాఱు చేయని ‘అతిశయోక్తు’
లొకవేళ కధాపురుషునిబట్టి కైకొన్నను దోషములేదు. కాని, కధను నడిపించుటలో నిర్దుష్టముగా నుండవలె ననియే నా దీక్ష.

ఈదీక్షతో నాకుఁ దోఁచిన త్రోవలో- ఈ రచన నడపించితిని. భాషావిషయముగా
రాజకీయముగా-ప్రాదేశికముగా వ్యక్తినిరూపణముగాఁ గొన్ని విశేషముల నిందు జిత్రించితిని. అప్పటి విశేషము లన్నియు సాకల్యముగా ఈ రచనలో ప్రతిబింప వలెనని నా మతము కాదు; కధానాయకుని విశేషములే ప్రధానముగా నాకుఁ గావలసినది. అయినను కధానాయకునిమూర్తిని 

బూర్తిగ నిందుఁ జిత్రించితి ననియుఁ గాదు; అదియు స్థాలీపులాకమే. ఒక విధముగా దిక్సూచియే.

ఉత్తమజీవితములు గల వ్యక్తులు సమకాలికుల సౌభాగ్యవిశేషములకు ప్రధాన
కారణమైనట్టులు-‘ఉత్తమ జీవిత చరిత్రలు’ ప్రజానీకమునకు ప్రాణప్రదము
లగుననియే నా భావము. ‘అతి పరిచయా దవజ్ఞా’ యన్నట్లు పెరటిలోని
కొన్ని మొక్కల విలువ మనకుఁదెలియకపోవచ్చును. ఎవ్వరేని యా విలువ
గుర్తించి వెలయించిననాడు- ఔనౌను నిజమేసుమా యని యౌడు గఱచి,
వేడుకగా విందుము.

వరదాచార్యులవారివంటి వ్యక్తులు మనకు దూరాన నున్నచో
దూరపుకొండలో నునుపు మనకుఁ దోచియే తీఱును. యావద్భారతము
మెచ్చుకోఁదగిన విశేషాంశము లాయనలో ఉన్నవనియు
సంస్కృతవాజ్మయ ముండునందాక-ఆయన ‘చిరంజీవి’గా
నుండుననియు సూత్రప్రాయముగా నాకు దోఁచుటయే ఈ రచన
కుపక్రమించితిని. ఇందు- ఆనుషంగితముగా అస్మదాదుల
చరిత్రయుఁ గొంతకుఁగొంత వచ్చుటలో హేతువు- ఆయన
జీవితములోని మెఱుఁగులను నిరూపించుటయేగాని వేఱుగాదు.

వారి సాహిత్యవ్యాసంగములు సన్నిధానవర్తులకే తెలియును.
వారి జీవితములోని మెఱుగులు పరితులకే-అర్ధమగును.
ఇవి యన్నియుఁ గొన్నేండ్లకు లోకములో కనుమఱుఁగై
కాలగర్భములోఁ గలసిపోవచ్చును. ఆయన కీర్తిమూర్తిని
గలకాలము స్థాపించి చూపించునది- ఆయన చేసిన
వాజ్మయసేవయే; ఆయన నిర్వహించిన కవితాధర్మమే.
అదియే ఆయన దివ్యజీవితములో మెఱుఁగైన భాగమని
యీచరిత్రలోఁ గొంతవఱకు నిరూపించితిని. ఆ భాగమున
కనుబంధముగా ముందువెనుకలు ముచ్చటించిన ఈ రచన
కూడ కలకాలము నిలిచియుండుననియే నా యాశ.
ఈ ‘యుభయము’ వలన వరదాచార్యులవారి దివ్యమూర్తి-
ఆచంద్రతారకప్రశస్తి గాంచి లోకమునకు వెలుఁగు
కూర్చునని యాశింతును.
                  -సత్యనారాయణ చౌదరి 

దివ్యస్మృతి, శివాయ గురవే నమః, సూచిక

దివ్యస్మృతి

గురుజనఋణాపనోదనం బరయఁ బూర్వ
జన్మసంస్కారమునుబట్టి జనుఁడొనర్చు
నందు; రది కొంత మూచూచినట్టివాఁడ
నగుట దీని‘కుపశ్రుతి’ యాచరింతు.

ఇది యొక మంచిజన్మమని
          యెంచుచుదీనికిఁదగ్గ త్రోవలోఁ
గుదురుగ నిల్చి సౌఖ్యమొనఁ
          గూర్చెడి వైఖరి కొంత నేర్చి యీ
బ్రతుకు వెలార్పఁగాఁ దగిన
         భారము మోపినతల్లిదండ్రులన్
ముదమున సంస్మరించుచును
      ముచ్చట తీర్చుకొనంగ నెంచెదన్.

౩.
అస్మదాచార్యజీవితం బది యమూల్య
గ్రంధముగ నెంచుకొన్న యీ‘రచన’కస్మ
దీయ‘పితరుల’సంస్మరణీయు లగుట
కాకతాళీయముగ భాగ్యకారణంబ.
     -సత్యనారాయణ చౌదరి







శివాయ గురవే నమః
‘కులపతి’ కృతినాయకం వరద మాచార్యదేవం
   గురుచరితాభివర్ణన కృతార్ధమన్తేవాసినం
              సత్యనారాయణం చ
         పాయా త్సదా దాశరధిః ప్రసన్నః.
ప్రకాశతాం కులపతే ర్విద్యాగోత్ర పరమ్పరా
        గైర్వాణీ సంస్కృతి సంపన్నా.
సంపద్యతాం చ సాంప్రతికేషు విద్యాలయేషు
     శాశ్వతికో గురుశిష్యానుబన్ధపటిమా.
              ఇత్యభిలషతి, ఆశాస్తే
           ఆచార్యదేవస్య ప్రియశిష్యః
           అన్తేవాసిమణేః ప్రియగురుః

               -వేంకట రమణశాస్త్రి



సూచిక 
పూర్వగాధ             ........        ౧
అధ్యాపకత్వము       ........      ౧౪
ప్రభుత్వోద్యోగము      ........     ౨౫
కొవ్వూరి కాపురము   ........     ౩౬
గురుకులాశ్రమము    .........    ౪౨
మధురస్మృతులు      .........    ౫౬
పర్ణశాల                ..........       ౬౭
వంశాంకురము        .........      ౭౩
దువ్వూరివారు         ........      ౭౯
జాతీయకళాశాల        .......     ౯౩
షష్టిపూర్తి               .........      ౧౦౩
గ్రంధరచన             .........      ౧౧౧
విశ్రాంతి                ........        ౧౪౬

 

కులపతి - పూర్వ గాధ


‘అష్టాదశపురాణేషు వ్యాసేన కథితం ద్వయమ్,
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్’


పరోపకారమే పుణ్యము. పరపీడనమే పాపము.
ఈ సూక్తి ప్రత్యణువున జీర్ణించి అక్షరాల పరోపకారమే
పాటించిన మహామహులు, ఏ కాలమువారైన ఏదేశము
వారైన సార్వకాలికముగా - సార్వదేశికముగా పూజ్యు
లనుటలో అత్యుక్తి లేదు. అడిగినది లేదనక సర్వస్వము లాఁతి
వారికయి ధారవోయు వదాన్య శిరోమణు లుండవచ్చును;
పరాక్రమైకధనులై లోకారాధనమే పరమ ధ్యేయముగా
భావించి కీర్తి గడించిన వీరాధివీరులు వెలయవచ్చును;
రాజకీయములలో ఆరితేఱి మానవసేవయే మాధవసేవగా
బ్రతుకనేర్చిన భవ్యజీవులు ఉద్భవింపవచ్చును.
కాని, విద్యాధనమింత పంచియిచ్చి అజ్‘జ్ఞానాంధకారములో
మ్రగ్గిన మానవులకు విజ్ఞానజ్యొతి వెలయించి దేశము
నుద్ధరించినవారి పుణ్యమే పుణ్యము.

లోకమాన్యుఁడు బాలగంగాధరుఁడు - పూజ్యుఁడు
మదనమోహనమాలవ్యా - పాంచాలకేసరి లాలా లజపతి
రాయి, ఆ శ్రేణిలో అగ్రిమస్థాన మందుకొన్న మహామహులు.

..............................................................................

కులపతి పూర్వగాథ                        2

విదేశవిద్యల మోజులో తికమకలై స్వస్థానవేషభాషాదికములు
మఱచి అస్వతంత్రమై అణఁగిపోయిన భారతజాతిని ప్రాచ్యమునకు
నడపించి జవసత్వములు కూర్చిన మహామహులు వారు.
వారి త్రోవలో మెలఁగి విద్యాధన మగ్గలముగా గడించి,
గడించినదానిని లోకులకుఁ బంచియిచ్చుటయే పరమార్ధముగా
భావించిన యొకానొక భవ్యమూర్తియే ఈ కథకు నాయకుడు.

ఆతఁడు తెలుఁగు గడ్డలో ఉద్భవించిన ఒకానొక ఆణిముత్తెము.
తెలుఁగు దేశము లెస్సగా నోఁచిన నోములపంట. పట్టాభివంటి
దిగ్దంతులు పుట్టి పెరిఁగిన బందరుపరగణాలో పేరు వొందిన
మనీషి. దబ్బపండువంటి మేనిచాయ. విద్యావైదుష్యము
వెలిఁబుచ్చు తిన్నని నెన్నుదురు. ఆత్మీయతను గోలుపోవని
గోష్పాదమువంటి కేశపాశము. ప్రశాంతిని వెలిఁగ్రక్కు విశాలమైన
కందోయి. నెమ్మొగమునకు వన్నె తెచ్చు కోటేరువంటి ముక్కు.
మూర్తీభవించిన సారస్వతము. జాతీయతను స్పురింపఁజేయు
వేషము. శైశవమునుండియు అభిజనము పిలుచుకొన్న
పేరు వరదయ్య. పెరిఁగి పెద్దయై లోక వ్యవహారములో
‘వరదాచార్యులుగా’పరిణమించిరి. విద్యావయోరూపములలో
ఆరమ్రుగ్గిన ఈ పండును విద్వల్లోకము మోజుపడి
‘కులపతి’ యని పిలుచుకొని గారవించెను.

తెలుఁగుబిడ్డయైన రామానుజుఁడే విశిష్టాద్వైతమత ప్రవర్తకుఁడయి
రామానుజాచార్యు లయ్యెను. తెలుఁగు దేశమునుండి వలసపోయిన
రామానుజకుటుంబమువారి సంప్రదాయములే తెలుఁగు దేశములో


............................................................

కులపతి పూర్వగాథ                           3


 మఱల వలసగా వచ్చుటఁజేసికాఁబోలు ఈ దేశములో
 ఆంధ్రవైష్ణవు లన్న యొక శాఖ యేర్పడినది.
ఉభయవేదముల ప్రసక్తి యుండుటఁజేసి యా శాఖ
వారు - ‘ఉభయ వేదాంతప్రవర్తకు’లుగా వ్యవహృతులైరి.
వారిలోను విశిష్య - తిరుమలనుండి సాగిన యీ
శాఖవారు శ్రీమత్తిరుమలవారైరి. సంప్రదాయమును బట్టి
మొన్న మొన్నటి వఱకు -ఈ వైష్ణవవంశ్యులు -
ఏఁడాదిలోఁ గొంతకాలము శిష్యసంచారము వెడలి
జ్ఞానోపదేశములో మతప్రచారములోఁ గాలక్షేపము
చేసెడివారు. ఈ వంశములో అనూచానముగ వచ్చు
గురుశిష్యసంప్రదాయమే నేఁడు కాలానుగుణముగ
పరిణామ మంది వరదాచార్యులవారిలో విశిష్టత
గడించుకొన్నది.

శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ నరసింహాచార్యులవారు
చిట్టిగూడూరులో సంపన్నగృహస్థు. ఆయన మొదటి
భార్య లక్ష్మీనరసమ్మ తొలిబిడ్డయే - ఈ వరదాచార్యులు.
రెండవ సంతానము - అలమేలు మంగతాయారమ్మ.
‘ద్వితీయమున’కొక్కర్తుకయేబిడ్డ. ఆమె పేరు
రాఘవమ్మ. ఈ చరిత్రలో ఈ గాథలో - కథానాయకుని
తో పాటు గణుతి గాంచిన పూజ్యురాలు - ఆండాలమ్మ.
ఆమెయే - ఆయనకు సవతి తల్లి. వరదయ్యా యని
ఆమె, యెదిగిన యా సవతి బిడ్డను నోరారఁ
బిలుచునప్పుడు - వరదన్నయ్య యని యా ముద్దు
చెల్లెలు రాఘవమ్మ, అన్నయ్యను బిలుచునప్పుడు
లాఁతివారమైన మాకే యొకానొక మహానంద
ముద్భవించెడిది.


....................................................................

కులపతి పూర్వగాథ                         4

ఆండాలమ్మవరదయ్యలలొ, వరదయ్య -రాఘవమ్మలలో
అనిర్వచనీయమైన యొకానొక యభేదాధ్యవసాయమే
స్ఫురించెడిది.

నందననామసంవత్సర శ్రావణ శుక్ల దశమినాఁడు
వరదయ్య జన్మించెను. సర్వలక్షణలక్షితమైన యా సంతాన
మును జూచుకొని యా కుటుంబ మెంతో సంబరపడెను.
పైగా -ఆయన లక్ష్మీపుత్త్రుఁడాయె, అల్లారు ముద్దుగాఁ బెరుగు
చున్న యా బిడ్డకు ప్రాధమికవిద్యలో వ్యాసంగము పూర్తి
చేయించిరి. తండ్రియు మేనమామయు సంస్కృతాంధ్రములు
నేర్పిరి. వరదయ్యకుఁ దొమ్మిదేండ్ల ప్రాయములోనే తల్లి
పరమపదించుటఁజేసి సవతి తల్లి - ఆండాలమ్మయే
సర్వభారము వహించెను. నాఁటినుండి యాయన
హృదయములో ఆమె మూర్తియే మాతృపీఠ మధిష్టించి
హత్తుకొనిపోయెను. ఏకైక పుత్త్రుఁడైన యా దశలో
సిరిసంపదలుతాండవించు ఆ యింటిలో తల్లిలేనిబిడ్డ
యన్నగారాము పిల్లవాని నేమైనఁ జేయవచ్చును. పైగా
లక్ష్మీసరస్వతులకుఁ బొత్తు కుదరనేరదన్న సూక్తియు
ముప్పాతిక మువ్వీసము - అక్షరాల నిజమగుట
లోకములోఁ జూతుము. దండిగా సిరిసంపదలు తాండ
వించు నింటిలో విద్యా జ్యోతి వెలుంగుటవింతలలో వింత.
చదువు సంధ్యలు చక్కఁగా సాగుటకు వీలున్నచోట
గ్రాసవాసములు చూచుటకే కాలము చాలదు. ఎవ్వరో
రవీంద్రుని జహ్వరిలాలువంటివారిని విడిచినచో లోకములోఁ
దలయెత్తిన యుత్తమవ్యక్తు లెందఱెందఱో శైశవములోఁ
పేదరికము చవిచూచినవారే. వరదయ్య అట్లుగాక
కలిమిబలిమిలో మునిఁగినను జదువులలో అంతరాయములు



.......................................................


 
కులపతి పూర్వగాథ                      5

లేక వినయసంపదలు పెంచుకొంచు హృద్యమైన విద్యకే
పరవళ్ళు త్రొక్కెను. దేశ పరిస్థితులను బట్టి రాజభాష గా
ఈ దేశములో ‘తిష్ట’ వేసిన ఆంగ్లముకోసమే వరదయ్యను
బందరు పంపిరి.

బందరులో చదువులు చక్కఁగా సాగుచున్నప్పుడే
పరీక్షార్థమో యన్నట్లు వరదయ్య జనకులు గతించిరి.
ఇంటిలోఁ జూడవలసిన వ్యవహారమా కావలసినంత.
పాడిపంటలతో గొడ్డుగోదలతో కలకలలాడు సంసారము పై
పరామరిక లేనిచో కాసులే గవ్వలుగా మాఱుటలో వింత
యేముండును? ఆ యింటి మంచిసెబ్బరల కన్నింటికి
మాతులుఁడైన రంగరామానుచార్యులే మూల
స్తంభమాయెను. ఆయన గ్రామమా దగ్గిఱిలోని గూడూరు.
ఆయన లౌకిక ప్రజ్ఞాధురీణుడు; పేరుగన్న సంపన్న గృహస్థు.
వ్యవసాయ గోష్ఠిలోఆరితేఱిన చేయి. సంస్కృతాంధ్రముల
సారస్యము చక్కఁగా నెఱిఁగిన మనీషి. కొండమీఁదికోఁతినేని
రప్పింపఁగల వ్యవహారదక్షుడు. బంధుసముద్రుడు. ఆయన
అంతవాఁడు గావుననే రెండు - ఊళ్ళలోని యీ రెండు
సంసారములను గంటికి రెప్పవోలెఁ గాపాడనేర్చెను. ఆయన
బిడ్డ లక్ష్మమ్మయే మేనల్లున కర్ధాంగలక్ష్మి. తల్లికి మాఱుగాఁ
దానే తల్లియై -ఆండాలమ్మ యిల్లు తీర్చుచుండగాఁ దండ్రికి
మాఱుగా మేనమామయే యండయై దండయై కనిపెట్టి
యుండఁగా వరదయ్య విద్యావ్యాసంగమునకు అంతరాయము
లవతరింపకుండుట ఆయన సుకృతవిశేషమే కావచ్చును.



..............................................


 
కులపతి పూర్వగాథ                                 6

అయినను - ప్రాక్తనజన్మవిద్యల కీ లౌకికవిఘ్నము
లొక విఘ్నములా!

అప్పటికే యీ దేశములో స్వస్థానవేషభాషల గౌరవము
సడలిపోయినది. ఈ దేశమును మనము కైవసము
చేసికోవలెనన్న మన మాతృభాషనే వీండ్రకు నూఱిపోయ
వలెనని మెకాలెదొర పలికిన పలుకు లక్షరాల సత్యములే
యైనవి. దాస్యములో మునిఁగిన యీ దేశములో - ఇంగ్లీషులో
నాలుగు ముక్క లంటినవానికే యేదోనొక యుద్యోగము
లభించెడిది. ఆ యుద్యోగమే యొక మహాభాగ్యముగా
భావించి దానికై యెగఁబడెడి రోజులు దాపరించినవి.
తరతరాలుగాఁ జదువు లొంటఁబట్టిన జాతులు - ఆర్థిక
ప్రపత్తి కాశించి ఆంగ్లేయ భాషకే యఱ్ఱులు చాఁచిరి.
ఆ భాషలోఁ జొఱవ యేర్పడిననాఁడు - అందలి మెఱుఁగులతో
పాటు తఱుగులుసైతము సంక్రమించెను. క్రొత్త యొకవింత
యన్నట్లు - ఆ వేషభాషలలోని వినూత్నత యాకర్షక
మాయెను. కేవలము మాతృభాషలే గాక పవిత్రమైన
గీర్వాణము సైతము నీరసస్థితికి వచ్చెను. ఒకవేళ - అవి
చదివినను ‘పరపతి’తఱుగై పోయెను. కాసులు గలవాఁడే
రాజన్న ధోరణిలో - పాశ్చాత్యప్రాభవమే సర్వత్ర పెరిఁగిపోయెను.
ఈ తీరు ధోరణిలో దేశ్యభాషలు దెబ్బతినుట రాజకీయ
నాయకులు గుర్తించి యాందోళనము చేసిరి. అప్పుడు
రాజభాషయగు  నాంగ్లమునకు దేశ్యభాష లంగములుగాఁ
జేర్చి ఆంగ్లకళాశాలలోఁ గొన్ని సదుపాయము లేర్పఱిచిరి.




..................................
 


 కులపతి పూర్వగాథ                                 7


 గురుకులాశ్రయ ధోరణిలోఁ జదువులు సాగవయ్యెను. ఆ మార్గములే
మృగ్యము లయ్యెను. ఒకవేళ శ్రమపడి సర్వశాస్త్రపారంగతులైనను
లౌకికముగా వారికి మన్ననయే లేదు; గ్రాసవాసములలోఁ
గుదిరికయే చిక్కదు.

ఆంగ్లభాషకై మోజుపడి ముందునకుఁ బోవలెనన్న
చేతిలో కాసులు గలగలలాడవలెను. అప్పుడు పెద్దచదువులు
కావలెనన్న రాజధానీనగరమునకుఁ బోవలయును. ఆ రోజు
లలో దక్షినాపథమున కంతకు - చెన్ననగరమే ప్రధానపత్త
నము. చెన్నప్ప తెలుఁగువాఁడైనను చెన్నపట్టణము తెలుఁగు
పట్టణమైనను నాలుగు మూలలనుండి నాలుగు జాతులు వచ్చి
పట్టణములోఁ జొచ్చిరి. పైగా - ఆ పట్టణము తెలుగునేలకు
విసిరివేసినట్టులు ఒక యంచులో నుండుటఁజేసి అక్కడి చదు
వులకై తెలుఁగువారు హెచ్చుగాఁ బోలేకపోయిరి. ఆ దశలో
చెన్ననగరములో పేరుమోసిన విద్యాసంస్థ, రాజధానీకళాశాల.
దానిలోఁ జదువవలెనన్న పేదసాదులకు సాధ్యమే కాదు.
మేధావులైన సంపన్నులకే - ఆ కళాశాలలో అవకాశములు
దొరకును.

బందరు చదువులు ముగిసిన పిదప వరదాచార్యులను
చెన్నపురికిఁ బంపిరి. ప్రెసిడెన్సీ కాలేజిలోవిద్యార్థిగా
నుండవలెనన్న - ఆ తాహతు వేఱు. ఆ దర్పము -
ఆ వేషము - ఆ కర్చువెచ్చములు ప్రత్యేకములుగా భాసించును.
కేవలము పల్లెటూరిలోఁ బుట్టిపెరిఁగినను నాలుగుముక్క
లింగ్లీషులో ఎంగిలి చేసినమాత్రాన - అవతారమే మాఱిపోవును.


౭ 

.............................................................................................


 కులపతి పూర్వగాథ                     8

చిట్టిగూడూరులోని వరదయ్యవేషమే చెన్ననగరములో సైతము
కానవచ్చును. పల్లెటూరిబడిలో - ఆయన వేసికొన్న
దుస్తులే ప్రెసిడెన్సికాలేజిలోఁగూడ - అనుస్యూతమాయెను.
ప్రాయికగా లోకములోఁ గొందఱి కింటిలో నీఁగలమోతయు
బయటఁ బల్లకీమోతయు సాజమైపోవును. తల్లిదండ్రులు
చెమట యోడ్చి నెత్తురు పిండి గ్రాసవాసములకే జరుగక
గాసివొందుచు చీమవోలెఁ గూడఁబెట్టి యల్లారుముద్దుగాఁ
బంపుకొన్న యా సొమ్మును గవ్వలుగా గ్రచ్చలుగాఁ
గర్చువెట్టు విద్యార్థు లెందఱెందఱో యుందురు. ఒకప్పు
డింగ్లండువంటి లాఁతిదేశములలో చదువులకోసమై వెళ్ళిన
భారతీయయువకులను జూచి లక్షాధికారుల బిడ్డలనియు
జమీందారుల సంతానమనియు అచ్చటివారు ముచ్చటించు
కొనెడివారఁట. అనఁగా వారి యూహలకు మన యువకుల
పోకడలే కారణమై యుండుటలో ఆశ్చర్యములేదు. ఇట్టి
వాతావరణము బాల్యమునుండియు వరదయ్య తత్త్వమునకే
సరిపడదాయె. ఇంటిలోఁ దల్లిదండ్రుల సన్నిధిని మన
మెట్లుందుమో వీధిలో సైతమట్లే నిరాడంబరముగా నుండ
వలెననియాయన తీర్పు. సమాజము కోసమై యెగిరిపడుట
వంతునకు గంతువేయుట - ఆయనకు రోఁత. తాత త్రవ్వించిన
నూయి కదాయని దానిలో ఊరిన యుప్పునీరే త్రాగవలెనని


..............................................

  కులపతి పూర్వగాథ                     9

 యాయన సిద్ధాంతంకాదు. నవ్యమైనను మంచి యున్నచో
గ్రహింపవలెనని ప్రాచ్యమైనను రోఁతయైనచో మానవలెనని
ఆయన తత్వము. ఆకుఁజెప్పులు వేసికొని - ఆ జుట్టుముడితో -
ఆయూర్ధ్వపుండ్రములతో - చొక్కా ధోవతులతో ప్రెసిడెన్సీకాలేజి
విద్యార్థిగాఁబోవు వరదయ్యలో విశేషము లేకపోలేదు.
ఆడంబరదృష్టి కది విడ్డూరమే కన్పించినను తాత్త్విక
దృష్టిలోఁ బరిశీలింప - అదియే స్థిరమై శ్రేయము నిచ్చును.
విద్యార్థియైన వరదయ్య మానసికతత్త్వమే - విద్యాధికులయిన
వరదాచార్యులవారిలో నేటికినీ జూతుము.

అప్పటి చదువులలో - అదే పెద్దచదువు. ఆనర్స్ క్లాసు,
అనఁగా-ఒక మత్తేభమును వాకిటఁ గట్టివేసినట్లే. అది
చక్కఁగా సాగి గట్టెక్కెనా పెరటిలో కల్పతరువు నాఁటినట్లే.
తల్లియుఁ దండ్రియు లేని యీ పసితనములో విసిరివేసి
నట్లున్న మదరాసులో నివాసము తప్పదాయెను. మేనల్లుఁడు
అల్లుఁడైన యీ పిల్లవాడు దూరదేశాన ఏమైన యిబ్బంది
పడునేమోయన్న బెంగచే రంగరామానుజాచార్యులు
కంట వత్తిడికొని కావలసినవి పంపుచుండును. సర్వ
వ్యవహారముల భారము మామయ్య బుజములమీఁద
వేసి యింటి పెత్తనమంతయు - ఆండాలమ్మ కప్పగించి
యిల్లాలు లక్ష్మమ్మను - అనుఁగుఁజెల్లెండ్ర నిర్వురను
విడిచి సర్వసంగపరిత్యాగి యగు యోగివోలె మదరాసులో
విద్యార్థిగా కాలము గడపెను.

 ౯

..................................


     కులపతి పూర్వగాథ                10

అప్పటి ప్రెసిడెన్సీకాలేజిలో పేరొపొందిన మహామహు
లిర్వురు -ఈ విద్యార్థి వరదయ్యకు అత్యంతాప్తులైన
ఆచార్యులైరి. వారిలో ఒకరు మహామహోపాధ్యాయులైన
కుప్పుస్వామిశాస్త్రివర్యులు. ఆయన విద్యావాచస్పతులై
ప్రాచ్యములో సర్వ శాస్త్రముల లోఁతుపాతులు తడవిచూచి
యం,ఏ పట్టభద్రత గడించిన దిగ్దంతులు. రెండవ
మహాపండితులు ప్రొఫెసరు రంగాచార్యులవారు. ఈ
యిరువురు వారి వారి అభిమానశాఖలలో ఇతరులకుఁ
దీసిపోవని ఉద్దండులు. వీరి శిష్యకోటిలో వరదయ్య,
ముఖ్యులలో ముఖ్యుఁడై మీమాంసారహస్యములను
వ్యాకరణాదికమును లెస్సగా నేర్చెను.

ఆ క్లాసులో ఆయనకు సర్వశ్రీ - తణికెళ్ళ వీరభద్రుడు
కందాళ హనుమంతరావుపంతులు వంటి ఉద్దండ
పండితులు సహాధ్యాయులట. ఆంగ్లభాషాపాండితి
గడించిన ఆంధ్రులలో వీరభద్రుఁ డొక పేరుమోసిన ప్రొఫెసరు.
ఆంగ్లపాఠశాలలలో అత్యున్నతశ్రేణిలోఁ జేరిన ప్రధానో
పాధ్యాయులలో కందాళవారు - ఒకరు. ఆచార్యులవారి
సహాధ్యాయులైన కందాళవారికి ఈ ‘రచయిత’
సహోపాధ్యాయుఁడుగా పనిచేయుట - ఆ తరుణములో
ఆచార్యులవారి విశిష్టతను ఆయన ద్వారా పదేపదే
వినుట కాకతాళీయముగా లభించిన భాగ్యముగా
ఈ రచయిత భావించుచుండును.

పాఠ్యగ్రంధములే బట్టీపెట్టి పరీక్షలో గట్టెక్కవలెనన్న
కాంక్షతో కాలక్షేపము సేయక ప్రత్యేకకృషి చేసి పేరు
వొందిన విద్యార్థులలో వరదయ్య ఒకరు.

౧౦
.................................


  కులపతి పూర్వగాథ                    11

లేఁబ్రాయమునుండి ఇంటివిద్యగా మన్నించుకొన్న సంస్కృతమే
ఆ క్లాసులో ప్రధానమై యుండుటఁజేసి పరీక్షలో అలవోకగా
విజయమందుటే కాదు; అధునాతన విద్యాప్రణాళికలో
అగ్రిమస్థానమందిన యమ్.ఏ. - ఆనర్స్ పరీక్షలో ప్రధమకక్ష్యలో
నెగ్గుట అగ్గింపవలసిన ఘట్టము.

ఆ చదువులలోఁ గానవచ్చిన విశిష్టమైన విజయముకన్న-
ఆయన వర్తన మత్యంతహృద్యమై వెలసినది.

రాజకీయముగా భారతీయులలో చైతన్య ముద్భవించి సాగిన
రోజులవి. విదేశములకు వలసవోయిన భారతీయుల మంచి
సెబ్బరలను బరిశీలించెడి నాథుఁడే ప్రపంచమున లేడు.
అస్వతంత్రమైన ఈ దేశమునకు వారి జోక్యము తీసికోవలెనన్న
బొత్తిగా అయితి కాదయ్యెను.

ఢిల్లీ కౌన్సిలులో గోపాలకృష్ణ గోఖలే చేసిన యాందోళనము
దేశములోఁ గొంత తెలిసెను. వలసలలో, విశిష్య - దక్షిణాఫ్రికాలో
జరిగెడి దురంతముల కంతు లేదు. అవి చూచిరమ్మని
ఇండియా ప్రభుత్వము ఇంగ్లాండునకు గోపాలకృష్ణ గోఖలేను
బంపెను. ప్రభుత్వము పెత్తనములో - ఆదేశమునకుఁ బోయిన
గోఖలేను దక్షిణాఫ్రికాప్రభుత్వము రాజదూతగా మన్నించి
సదుపాయములు కావించెదమని యేవేవో వాగ్దానములు
చేసెను. అప్పుడు గాంధీజీ అక్కడనేయుండి గోఖలేవెంట
ఆ దేశములోఁ దిరిగి భారతీయుల కష్టసుఖములను
బూస గ్రుచ్చినట్టులు బోధించెను. గోఖలే యిండియాకు
వచ్చినపిదప ఎన్నాళ్ళకును దక్షిణాఫ్రికాలో

౧౧
................................ 



 కులపతి పూర్వగాథ                  12

వాగ్దానములు మన్నింపలేదు. అక్కడ గాంధీజీ సత్యా
గ్రహమే ప్రారంభించెను. ఆ‘నినాద’ మీదేశములో గోఖలే
వినిపించి సత్యాగ్రహ బాధితులను మన మెల్లర మాదరింప
వలెనని హెచ్చరించెను. చెన్నపురిలో - కాలేజీపిల్లలుసైతము
చందాల కుపక్రమించిరి. రాజధానీకళాశాలలో ఉపన్యాసములు
జరిగినవి. విద్యార్థులు వేసిన చందాలలో - అయిదు
రూపాయలు  చిన్నపద్దుగాను బదునాఱు   రూపాయలు
పెద్ద పద్దుగాను అందఱు భావించెడి యా సందడిలో -
ఏదో యొకమూలఁ గూరుచున్న యొకానొక విద్యార్థి
అయిదువందల రూప్యముల  యంకె వేసెను. సభలో
గుసగుసలు వోయిరి. ఎవ్వ రా విద్యార్థియని యెల్లవారు-
అఱ్ఱు లెత్తి నల్గడ కలయఁ జూచిరి. ఆయన యెవ్వరో కాదు;
చిట్టిగూడూరునుండి వచ్చిన వరదాచార్యులవారే వారు.
ఆ వేషభాషలతో నిరాడంబర జీవికతో నివుఱు గప్పిన
నిప్పువోలె ఎవ్వరికంటికి రాక ఒదిగియున్న యీ వ్యక్తిలో
ఇట్టివిశేష మున్నదాయని సహాధ్యాయులు నివ్వెఱవోయిరి.
అధ్యాపకు లాశ్చర్యపడిరి. ఇక్కడ రెండు వింతలు.
అన్నాళ్ళు కాలేజిలోఁ గలసిమెలసియున్నను - ఇంటిలో
ఆయన కున్న సిరిసంపద లెట్టివో - ఆ గుండెలోఁ
గరడుగట్టి మకాము వెట్టిన యా కారుణ్య మెట్టిదో యప్పటికిఁ
గాని సహాధ్యాయులకే యర్థము కాలేదు. వెంటనే యా
మొత్తమును - తంతిమూలమునఁ దెప్పించి వారి
కర్పించి తన వదాన్యతనే గాక జాతీయదృష్టినే గాక
దయార్ద్ర భావమును సైత మా లేతవయస్సులో నిరూపించెను.

౧౨


.................................. 


కులపతి పూర్వగాథ                     13

మేనల్లునకు బిడ్డ నిచ్చి యొక యింటివానిని జేయు
టయేగాక - ఆయనకు రంగరామానుజాచార్యు లాదిలో
సాహిత్యగురువయ్యెను. ఆవల మహోద్దండపండితులైన
శ్రీమాన్ కాండూరి తాండవకృష్ణమాచార్యులవారిని దమ
యింటిలోఁ బెట్టుకొని వరదాచార్యులు శాస్త్రములు
చక్కఁగాఁ జదువుకొనెను.

అందచందములు గలిగియు జవ్వనపు మిసిమిలో తొణి
కిసలాడియు - అసిధారావ్రతమువంటి నిత్య దినచర్యను
బాటించెనన్న - ఆయన ప్రకృతి పరీక్షింపవలెను. చేతిలో
నిండుగా ధన ముండియు సర్వశాస్త్రములు క్షుణ్ణముగా
అభ్యసించియు సంస్కృతాంగ్ల సాహిత్యములో లోఁతులు
తడవిచూచియు చెన్నపురీనివాసము చవి యెఱింగియు-
ఆడంబరమును రవ్వంతేని దరికి రానీయఁడాయెను. ఆ
దివ్యమూర్తిలో గర్వ గంధము లవలేశమైనను గానరాదు.
విద్యాయౌవనములలో-ఆభిజాత్యసంపదలలో ఏదియేని
ఒక్కటి యున్నను మానవున కనర్థములు పొరయించునని
శాస్త్రములు చెప్పును. ఈ నాలుగును  వరదాచార్యులలో
కేంద్రీకరించి యుండియు వివేకమునే పెంచినవి కాని
అనర్థమును మచ్చునకైన ఆపాదింపవయ్యెను. కాసు
వీసములు కర్చువెట్టి రేయుంబవలు ఆంగ్లభారతిని
ఆరాధించినవాఁడయ్యు గీర్వాణవాణీ పరివస్యలను
ఏమఱియుండలేదు. బడిలో-అంగభాషగా సాధించుకొన్న
సంస్కృతమే ఆయన జీవితములో ప్రధానాంగముగా
పరిఢవిల్లెను.


౧౩

.............................................................................
...........................................................................
 

అధ్యాపకత్వము


అధ్యాపకత్వము                     14

చెళ్ళపిళ్ళవంటి కింకవీంద్రఘటాపంచాననుల సంచారమువలన -
పట్టాభివంటి దిగ్దంతుల ప్రచారములవలన -
ముట్నూరువంటి అభిజ్ఞుల ముందడుగులవలన
బందరు పట్టణము తెలుఁగుగడ్డలో ప్రశస్తి గాంచినది.
సాహిత్యసభలకు ఆ పట్టణము పెట్టినదిపేరు.

కవికుమారుల కా నగర మచ్చివచ్చిన కాణాచి.
ఆ బందరుపేఁట రాజకీయవాసనలు గుబాళించిన తెలుఁగుతోట.
పట్టాభివంటి పేరుమోసిన విజ్ఞులకు -
ఆంగ్లసాహిత్యము నూఱిపోసిన ‘రఘుపతి’వంటి రసజ్ఞశిఖామణులు
ఆ పట్టణమునకు పేరు తెచ్చి పెట్టిరి. రాజకీయమహోద్యమములలో
యావద్భారతమునకు బందరునకు - అనుస్యూతమైన
సంబంధమున్నది. ఒకప్పుడు వంగరాష్ట్రవిభజనసమస్య ఈ
దేశమంతను గగ్గోలుపెట్టెను. బంగాళములో స్థానికముగాఁ
దలపెట్టిన యా యుద్యమము ఆంగ్లేయుల పరిపాలనా
ప్రాభవమువలన యావద్భారతము నంటుకొనెను.
విద్యార్థులు రాజకీయములలోఁ బాల్గొనరాదని ప్రభుత్వము
నిషేధించెను. వెంటనే దేశములో పాఠశాలాబహిష్కరణోద్యమము
ప్రకోపించెను. ప్రభుత్వముతోడి పొత్తు గలిగిన పాఠశాలలు
బహిష్కరించిన నాఁడు జాతీయవిద్యాశాలలు స్థాపింపవలెనని
దేశనాయకులు సంకల్పించిరి. ఆ యాగములో

౧౪


.............................................................. 


 అధ్యాపకత్వము                 15


 ఒక్క తూర్పుబంగాళములోనే యిరువదినాలుగు జాతీయ
విద్యాలయములు స్థాపించిరి. బంగాళములో మహావక్తలలో
బాబూ బిపినచంద్రపాలు పేరుగన్న మహావ్యక్తి. ఆయనచేతిలో
‘న్యూ - ఇండియా’ యనివారపత్రిక యుండెను. ఆయన
యుపన్యాసములకు దేశ మెగఁబడివచ్చును.


1907లో బిపినచంద్రపాలు తెలుఁదేశమునకు వచ్చెను.
బందరు - రాజమహేంద్రవరములవంటి పట్టణములలో -
ఆయన యుపన్యాసములు విని యెందరో విద్యార్థులు ముగ్ధులై
పోయి రాజకీయములలోఁ జొచ్చిరి. ఆ సంచారములోనే
ఆ మహావక్త బందరులో జాతీయవిద్యాబీజము నాఁటెను.
తత్ క్షణమే - అది యొక యంకురమై - అద్భుతముగా
సాగిన జాతీయ మహోద్యమమువలన దోహదము చెంది
మహావృక్షమై ప్రభుత్వ ప్రాతికూల్య మను మండునెండలకు,
వడగాల్పులకుఁ దాళియుఁ బూలు బూచియుఁ  గాయలు
కాచియు దేశమునకుఁ గొంత సాయము చేసెను.
బందరుపట్టణములోఁ బేరు నిల్పిన మహోద్యమ స్వరూపమే
బందరు జాతీయకళాశాల. పట్టాభివంటి పెద్దల చేతిలోఁ
బెరిఁగిన యా మహావృక్షమునకు - కోపల్లె హనుమంత రావు
పంతులు కాండమువంటివాడు. ఆయనయే ఆ సంస్థ;
ఆ సంస్థయే ఆయనగా రూపు గాంచిన రోజులు గలవు.
జాతీయవిద్యాప్రణాళికలో భారతీయుల కవసరమైన
యంశము లన్నియుఁ జేర్చి విద్యార్థుల హృదయమునకు
వికాసమును గూర్చుటయే - ఆ సంస్థ సంకల్పము.
శిల్పము సాహిత్యము మున్నగు లలితకళలలో - ఆ సంస్థకు

౧౫


............................................................



అధ్యాపకత్వము                      16

మంచి పేరు వచ్చినది. ఎందఱో నేఁడు రాజకీయనాయకులుగా
నుండువారు - అందలి చదువులు చదివినవారే యనుట మనము
మఱువరాదు, అట్టి జాతీయవిద్యాలయములో వరదాచార్యుల వా
రొక అధ్యాపకులుగాఁ జేరిరి.

అది వారికి భృతకోపాధ్యాయపదవి కాదు. దేశీయ మహానాయకుల
సంకల్పబలము కలిమిని జన్మించిన యా సంస్థలో పని చేయుటయే
మహాభాగ్యముగాఁ దోఁచి ఆచార్యులవా రక్కడ - అధ్యాపకులైరి.
కేవలము  అధ్యాపకు లేగాక, ఆ విద్యాలయమున కాయువుపట్టుగా
నున్న వారిలో వారొకరుగా నిర్ణీతులైరి. అంతలో ఆయన విద్యా
శేముషీ వైభవములను గుర్తించి విజయనగరమునుండి
ఉద్యోగమునకాహ్వానము వచ్చెను.

విజయనగరము తెలుఁగు గడ్డలో నిజముగా విద్యానగరమే.
అక్కడ - ఆనందగజపతిమహారాజుల అండదండల వలన
సంగీతసాహిత్యములే గాక సర్వశాస్త్రములు అభ్యుదయ
మందినవి. వివిధశాస్త్రనిష్ణాతులైన పండితు లెందఱెందఱో
ఆ మహారాజు నాస్థానమున కలంకారములైరి. ఆయన
నెలకొల్పిన మహా సంస్థలలో ‘విజయనగరమహారాజ
సంస్కృతకళాశాల’ యొకటి.

ఈ సంస్థ ఇటీవలనే శతజయంతిమహోత్సవమును
మహూత్సాహముగా జరుపుకొన్నది. ముమ్మొదట ఈ
సంస్థ వేదశాస్త్ర పాఠశాలగా ఉద్భవించి ఆవల 1915 వ -
సంవత్సరమునుండి సంస్కృతకళాశాలగా అవతరించినది.

౧౬


......................................

అధ్యాపకత్వము           17

అప్పుడు దీని కధ్యక్షులుగా శ్రీమాన్ కిళాంబి
రామానుజాచార్యులవారి నెన్నుకొనిరి. యావద్భారతములో
పేరుమోసిన వైయాకరణ సార్వభౌములు - సాహిత్య
రత్నాకరులు - సకలశాస్త్రసారజ్ఞులు - మహామహోపాధ్యా
యులు తాతా సుబ్బరాయశాస్త్రివర్యులు - ఆ విద్యాలయ
మందలి పండితులలో ముఖ్యపండితులు. సంస్కృతాంధ్ర
వ్యాకరణములో సంస్కృతాంధ్రసాహిత్యములో - అద్వితీయులైన
‘కళాప్రపూర్ణులు’ వజ్ఝల చిన సీతారామస్వామిశాస్త్రులవారు -
అక్కడి తెలుఁగునకు పీఠాధిపతులు. ఆదిలో వరదాచార్యులవారు -
ఉపాధ్యక్షులుగా నిర్ణయింపఁబడినను - ఆయన ప్రజ్ఞాపాటవమును
బట్టి పరిపాలనాప్రాభవములో ‘సర్వస్వామ్యము’లాయనకే
సంక్రమించినవి.

శైశవమునుండి శ్రద్ధగాఁ దాను జదివిన చదువులకు విజయ
నగరవిద్యాలయము నికషాయమానమైనది. యావద్భారత
దేశములోని ప్రాచ్యవిద్యాలయము లన్నింటికి విజయనగర
విద్యాలయము తలమానికము. అచ్చటి యధ్యాపకులాసర్వ
శాస్త్రనిష్ణాతులైన దిగ్దంతులు. ఆ సంస్థను నిర్వహింపను
గ్రాసవాసములా కావలసినన్ని యున్నవి. విద్యలలో అపర
భోజుఁడైన విజయనగరమహారాజు కనుగలిగి చూచుచుండఁ గాఁ
గావలసిన దేముండును? తెలుఁగుగడ్డనుండియే గాక ఒరిస్సావంటి
పరిసరములనుండియు విద్యార్థు లెందఱో వత్తురు.
ఆంగ్లేయవిద్యలవలె వీని కార్థికముగా విలువ లేక పోవచ్చు.
భారతీయతత్త్వము నిరూపింపవలెనన్న - ప్రపంచ

౧౭


..................................................


అధ్యాపకత్వము               18
 

ములో భారతమున కున్న విశిష్టత గుర్తింపవలెనన్న - ఈ
చదువులే మూలకందము లనుట ముమ్మాటికి నిక్కము.
కాని ధనమే ప్రధానముగా లోక మెంచును గావున -
ప్రాచ్యవిద్యలను బోషింపవలెనన్న విద్యార్థులను బోషింపవలెను.
అన్నము పెట్టి అక్కఱయైన విద్యలు నేర్పి తమయంతవానిని
జేసి శిష్యు నింటికిఁ బంపుటయే ప్రాచీన గురువుల పద్ధతి.
వారియింటఁ గనుగలిగి మెలఁగి నిచ్చలు గురుశుశ్రూష
యేమఱక విద్యలతోపాటు వినయసంపద గడించుటయే
యప్పటి విద్యార్థివాలకము. గురువులలో దొసఁగు లేవేని
యున్నను వానిని మాటుపఱుచువాఁడు ఛాత్రుఁడఁట.
ఆయన యంతికములో నివసించి కావలసినవి నేర్చువాఁడు -
అంతేవాసియఁట. వాజ్ఞ్మయములోఁ బ్రసిద్ధములైన యిట్టి
పదము లన్నియు మన ప్రాచీనుల గురుకులాశ్రమ
విధానములను వేనోళ్ళ వెళ్ళడించును.

ఈ సంప్రదాయము లెస్సగా నెఱిఁగిన విద్వాంసులు
కావున వరదాచార్యులవా రీ యుద్యోగమునకు వచ్చిరి.
అందనుక బందరులోఁ దా నవలంబించియున్న పదవిలో
మఱొక యధ్యాపకుని నిర్ణయించి ఆయనకుఁ గావలసిన
జీతబత్తెములు తానే భరింతునని మాటయిచ్చి విజయ
నగరము చేరెను. అక్కఱ పట్టినంతవట్టు బందరులో ఆ
యుపాధ్యాయుని వరదాచార్యులే పోషించిరి.

విజయనగరములోఁ దాను జేయవలసినది కేవలము
అధ్యాపకత్వమే గాదు. విద్యాలయమున కనుబంధముగా

౧౮


.............................................


అధ్యాపకత్వము               19


‘భోజనవసతి’యుఁ గలదు. మహారాజపోషణలో నున్నది
కావున వస్తువాహనములకుఁ దఱుగు లేదు. కాని యాజ
మాన్యలోపమునుబట్టి యా సంస్థల పరమార్థమే దూరము
కావచ్చును. వెట్టిగ నేదో యింత వెట్టి చదువులు చెప్పినను
ఫలితము దక్కదు. ఈ రహస్యము వరదాచార్యులవా రెఱింగి
విద్యాలయ మొక కంటను భోజనాలయ మొక కంటను
గనిపెట్టి యుండిరి. ఆరోగ్యభాగ్య మున్ననాఁడే చదువుసంధ్యలు
చక్కఁగా సాగును. పుష్టి లేని తిండి పెట్టిన నాఁడు  వానికిఁ
జదువులు ఒంటఁబట్టులోఁగా రోగము లంటి ఆపై యొంటిని
జీర్ణింపవచ్చును. రోగములు కాఁపురమున్న విద్యార్థి, విద్యాధికుఁ
డయ్యు లోకమున కేమి చేయఁగలడు? అప్పుడు విజయ
నగరములో విశేషమైన జబ్బు లున్నవని దేశములో
వదంతి కలదు. దూరదేశమునుండి వచ్చియు రోగములకు
జంకి ‘పరారి’ యైన విద్యార్థులును  గలరు. ఈ దశలోఁ
జేయవలసిన పని యెంతో గలదని వరదాచార్యులవారికిఁ
దోచెను. శాకపాకములలోఁ దఱుగులు వచ్చెనేని - ఈ పిల్ల
లేమైపోదురన్న బెంగ ఆయన కుండెడిది. తానుగా నిచ్చలు
సహస్రాక్షుఁడై యా సత్రమును గనిపెట్టి యుండి వంటలో
దొసఁగులు పొసఁగకుండఁ గాపాడును. ఇరుపూటఁ దానుగాఁ
బరీక్షించినఁగాని విద్యార్థులకు భోజనము పెట్టరాదని
కట్టడ చేసెను. తనయింటఁ దన యావులపాలు పోసి  పేద
సాదులగు విద్యార్థుల పథ్యపానములు చూచును,

౧౯


..................................


అధ్యాపకత్వము                     20

ఆ పట్టణములో అధ్యాపకుఁడుగాఁ దనకు వచ్చు రెండువందల
రూప్యములను - ఎప్పటికప్పుడే పేదవిద్యార్థుల యక్కఱలకుఁ
గర్చువెట్టును. తన గ్రాసవాసములకుఁ గావలసిన దంతయు
స్వగ్రామమునుండి రావలసినదే. విద్యార్థిదశలోనే వితరణ
శాలియని మదరాసులో పేరు వొందిన వరదాచార్యులవారు
విద్యాధికులై విజయనగరములో విశిష్టత గాంచుటలో విశేష
మేమున్నది ?

వివిధప్రదేశములనుండి వచ్చిన విద్యార్థులమనస్తత్త్వములో
వైవిధ్య ముండును. తన యింటిపరిస్థితి సర్వము మఱచి
చదువులు ముదిరినకొలఁదియుఁ దత్త్వములో మార్పు
పొందువారు కొందఱు. హృద్యమైన విద్యతోపాటు వినయ
సంపద సంపాదించుకొని రాణించువారు కొందఱు. విద్యా
గంధముతోపాటు గర్వగంధము పెరిఁగి ప్రవర్తించువారు
కొందఱు. ఇంటను బయటను దమ శిష్యుల నొకకంటఁ
గనిపెట్టి యుండవలెనని వరదాచార్యులవారి దీక్ష.
మహోద్దండులైన పండితోత్తములయ్యు కళాశాలోఁదమ
తమ విధ్యుక్తముల నెట్లు నిర్వహించుచుందురో వారి
పాండిత్యప్రతిభలు పిల్లల కెట్లు -అక్కఱకు వచ్చుచున్నవో
వేఱొకకంట సమీక్షింపవలెను. ప్రాచ్యవిద్యలోని మెఱుఁగులు
క్షుణ్ణముగా గ్రహించిన విదేశీవిద్వాంసులు వ్రాసిపెట్టిన
చక్కని విమర్శనాభాగములను సంస్కృతవిద్యార్థులకుఁ
దానుగా బోధింపవలెను. తన కత్యంతము ప్రాణప్రదమైన
గీర్వాణములో ఉద్గ్రంథములను గొన్నిటిని పాఠము చెప్ప

౨౦
................................................



   అధ్యాపకత్వము                                      21

వలెను. కళాశాలాపరిపాలనను బోధనాభాగము - ఒక
యెత్తుగా విద్యార్థుల మేలుగీళ్ళరయుట యొక యెత్తుగా
వరదాచార్యులవారు భావింతురు. విద్యార్థిజీవితములో
విద్యాభ్యాసదీక్ష - సత్ప్రవర్తనాకాంక్ష పడుగుపేకలవంటివని
యాచార్యులవారి నిర్ణయము. ఎన్ని చదువులు చదివినను
నీతి లేనివారు వాసన లేని పూవులే. మొదలు - విద్యకు
జ్ఞానసంపాదనమని యర్థమున్నను - అయ్యది నేఁడు మృగ్యమే
యగుచున్నది. చదువులు చదివిన వా రెల్లరు వివేకవంతు
లగుటలేదు. వివేకమును బోషించు చదువే చదువు- అని
ప్రాచీనుల మాట. అది నేఁ డాచరణలో అదృశ్యమై
పోయినది. ఇరువదినాలుగు గంటలలోను - ఏ యయిదాఱు
గంటలో నేఁటి విద్యార్థి గురువుల సన్నిధిలో కాలము గడ
పును. తక్కినవేళలలో వాఁ డేమి చేయునో వానివైఖరి
యెట్టిదయ్యెనో పట్టించుకొనువారే కన్పట్టరు. సర్వకాల
సర్వావస్థలలో గురుశిష్యుల కనుస్యూతమైన సంబంధ
ముండుటఁజేసి గురుకులవాసములోని విలువ ప్రాచీనులు
గుర్తించిరి. కాలపరిస్థితినబట్టి యా కట్టుపాటులు మాఱినను
విజయనగరసంస్కృతకళాశాలలో - ఆ ప్రాచీనసంప్రదాయ
మును గొంతకుఁగొంత సుకుమారముగ వరదాచార్యుల
వారు పాటించిరి.

కళాశాలలో గురువులు చెప్పిన పాఠములు విద్యార్ఠి
చింతన చేయుచుండెనో లేదో, గ్రాసవాసములకు వీసమేని
లోపము లేదుగాన పోనీ! యని యేదో రీతిగ విద్యార్ఠి కాల

౨౧


...............................................


   అధ్యాపకత్వము                           22

క్షేపము చేయుచుండెనేమో! నిచ్చలు - అట్టివారి యంటు
సొంటు లుండుటఁజేసి తక్కిన ‘యర్భకులు’కొందఱు తలక్రిందు
లగుచుందురేమో! గోటితో గిల్లివేయవలసిన ఘట్టమును
జూచియుఁజూడకున్నచొ గొడ్డలియే కావలసివచ్చును.
తాత్కాలికముగ అప్రియమైనను శ్రేయోభిలాషియైనవాఁడు
హితమునే పలుకవలెను.

రేయి పదింటికి ‘వసతి’ గృహములో విద్యార్థి యేమి
చేయునో యేమి చదువునో వరదాచార్యులవారు వెళ్ళి
చూతురు. వాండ్రు గుములుగట్టి తలుపులు గట్టిగా బిడా
యించి చక్కఁగా - పేకాటలో మినిగిన రోజులు గలవు.
అదే వేళలో - ఆచార్యులవారు వెళ్ళి తలుపు తట్టఁగా ఆతఁ
డెవ్వఁడో సహాధ్యాయుఁడే గదా యని యాలకింపకపోఁగా
‘గీర్వాణము’చూపిన ఘట్టములు కలవఁట. నెమ్మదిగాఁ దలు
పులు దీయించి గడగడ వడఁకుచున్న యా కుఱ్ఱలను ముసి
ముసినవ్వులతో మందలించి దారికిఁ దెచ్చిన పద్ధతులు కలవు.
ఎవ్వఁడేని విద్యార్థి భోజనమునకు రానిచో దాని కారణ
మాచార్యులవారికిఁ దెలిసితీఱవలెను. ఏదేని యస్వస్థత విద్యా
ర్థికిఁ గన్పించెనేని తానుగాఁ బోయి మందుమాఁకు లిప్పించి
పథ్యపానములు చూచును. అతని కారోగ్యము దొరకి పాఠ
ములు వినఁగలుగునందాఁక - ఆయన పరామరిక యుండి
తీఱును. ఊరిలోఁ బనికిరాని చవుకపాఱు శాకములు తెచ్చి
కూరనారలు వండి పిల్లలకుఁ బెట్టినచో ముందుగా బాధపడు
నది విద్యార్థులు కాదు; ఆ బాధలోఁ దొలిపాలు - ఆచార్యుల

౨౨
.................................


  అధ్యాపకత్వము                                        23

వారిదే. ఆయన‘సమీక్షలో’ సర్వము వండినప్పుడే - ఆయనకు
సంతర్పణము; ఆ బిడ్డ లా తిండి తిని యా చదువులలో
మునిఁగినప్పుడే - ఆయనకు పరమానందము. అల్లారుముద్దుగాఁ
బెరిఁగియుఁ దల్లిదండ్రులను విడిచి దూరదేశమునకు వచ్చి
విజయనగరాధీశునిదరిఁ జేరిన యా కుఱ్ఱలకు - ఈ ‘పూజారులు’
వర మేల యీయరని యాచార్యులవారి దీక్ష. వలసినవారి
కెల్లరకుఁ దానుగా వలువలు విలిచి యిచ్చి - అక్కఱయైన
సదుపాయములు చక్కఁగాఁ జేసి చూపి - భోజనభాజన
‘వసతుల’ను మురిపముతో నేరుపఱిచి - ఆధివ్యాధులు కలుగక
కుండఁ గంటికి రెప్పవోలెఁ గాపాడుచున్న వరదాచార్యులవారు
విద్యార్థిబృందమునకుఁ దల్లిదండ్రులే గాదు; కల్పవృక్షమే
యన్నను - అతిశయోక్తి కాదు.

ఆడంబరము కోసమై తెచ్చిపెట్టుకొన్నవి యేవియేనియు
నిముషములోఁ దెలిసిపోవును. సహజముగఁ బుట్టినవే నాలుగు
కాలములపాటు నిలిచియుండును. మాటలలో - ఆచార్యుల
వారు మితభాషులు. ఆడంబరమైన పలుకుగాని - అర్థము లేని
పనులుగాని - ఆయనకు గిట్టవు. విద్యార్థులను దాను హృదయ
పూర్వకముగఁ బ్రేమించినను బ్రేమించినట్లు నటింపడు.
‘క్రియా కేవల ముత్తర’మ్మను తత్త్వమే ఆయన తత్త్వము.
స్వార్థము - ఏ కోశములోను లేశమేని యెఱుంగక నిత్యము
విద్యార్థుల యోగక్షేమమునకే దీక్షగాఁ బనిచేసిన వరదా
చార్యులవారిని విజయనగరములో గారవింపనివారు లేరు.
నానాదేశాగతులైన విద్యార్థు లాయన సన్నిదానములోఁ

౨౩
..........................................................


అధ్యాపకత్వము                  24

జదువులు చదివి యారితేఱినవెనుక తమతమ జీవితములలో-
ఆయనను మఱచిపోయినవారు లేరు. విజయనగరభూపాలుఁడు
విద్యలకై చేసిన సదుపాయములను అందఱును చక్కఁగా
పొందుటకై యాచార్యులవారు చేసిన నిరంతరకృషిని - ఆ
పట్టణములో మెచ్చనివారును లేరు. అధికారులు - అనధికారు
లాయనకు బ్రహ్మరథమే పట్టిరి. ఆ విద్యాసంస్థలో సర్వతో
ముఖముగ - ఆయన యేర్పఱిచిన బాట రాచబాటయై భావి
కాలములో సైతము మిక్కిలిగా రాణించెను.








౨౪

ప్రభుత్వోద్యోగము

 ప్రభుత్వోద్యోగము










కొవ్వూరి కాపురము

కొవ్వూరి కాపురము





గురుకులాశ్రమము

గురుకులాశ్రమము










 

 

మధురస్మృతులు

మధురస్మృతులు










పర్ణశాల

పర్ణశాల