Sunday 11 December 2011

అధ్యాపకత్వము


అధ్యాపకత్వము                     14

చెళ్ళపిళ్ళవంటి కింకవీంద్రఘటాపంచాననుల సంచారమువలన -
పట్టాభివంటి దిగ్దంతుల ప్రచారములవలన -
ముట్నూరువంటి అభిజ్ఞుల ముందడుగులవలన
బందరు పట్టణము తెలుఁగుగడ్డలో ప్రశస్తి గాంచినది.
సాహిత్యసభలకు ఆ పట్టణము పెట్టినదిపేరు.

కవికుమారుల కా నగర మచ్చివచ్చిన కాణాచి.
ఆ బందరుపేఁట రాజకీయవాసనలు గుబాళించిన తెలుఁగుతోట.
పట్టాభివంటి పేరుమోసిన విజ్ఞులకు -
ఆంగ్లసాహిత్యము నూఱిపోసిన ‘రఘుపతి’వంటి రసజ్ఞశిఖామణులు
ఆ పట్టణమునకు పేరు తెచ్చి పెట్టిరి. రాజకీయమహోద్యమములలో
యావద్భారతమునకు బందరునకు - అనుస్యూతమైన
సంబంధమున్నది. ఒకప్పుడు వంగరాష్ట్రవిభజనసమస్య ఈ
దేశమంతను గగ్గోలుపెట్టెను. బంగాళములో స్థానికముగాఁ
దలపెట్టిన యా యుద్యమము ఆంగ్లేయుల పరిపాలనా
ప్రాభవమువలన యావద్భారతము నంటుకొనెను.
విద్యార్థులు రాజకీయములలోఁ బాల్గొనరాదని ప్రభుత్వము
నిషేధించెను. వెంటనే దేశములో పాఠశాలాబహిష్కరణోద్యమము
ప్రకోపించెను. ప్రభుత్వముతోడి పొత్తు గలిగిన పాఠశాలలు
బహిష్కరించిన నాఁడు జాతీయవిద్యాశాలలు స్థాపింపవలెనని
దేశనాయకులు సంకల్పించిరి. ఆ యాగములో

౧౪


.............................................................. 


 అధ్యాపకత్వము                 15


 ఒక్క తూర్పుబంగాళములోనే యిరువదినాలుగు జాతీయ
విద్యాలయములు స్థాపించిరి. బంగాళములో మహావక్తలలో
బాబూ బిపినచంద్రపాలు పేరుగన్న మహావ్యక్తి. ఆయనచేతిలో
‘న్యూ - ఇండియా’ యనివారపత్రిక యుండెను. ఆయన
యుపన్యాసములకు దేశ మెగఁబడివచ్చును.


1907లో బిపినచంద్రపాలు తెలుఁదేశమునకు వచ్చెను.
బందరు - రాజమహేంద్రవరములవంటి పట్టణములలో -
ఆయన యుపన్యాసములు విని యెందరో విద్యార్థులు ముగ్ధులై
పోయి రాజకీయములలోఁ జొచ్చిరి. ఆ సంచారములోనే
ఆ మహావక్త బందరులో జాతీయవిద్యాబీజము నాఁటెను.
తత్ క్షణమే - అది యొక యంకురమై - అద్భుతముగా
సాగిన జాతీయ మహోద్యమమువలన దోహదము చెంది
మహావృక్షమై ప్రభుత్వ ప్రాతికూల్య మను మండునెండలకు,
వడగాల్పులకుఁ దాళియుఁ బూలు బూచియుఁ  గాయలు
కాచియు దేశమునకుఁ గొంత సాయము చేసెను.
బందరుపట్టణములోఁ బేరు నిల్పిన మహోద్యమ స్వరూపమే
బందరు జాతీయకళాశాల. పట్టాభివంటి పెద్దల చేతిలోఁ
బెరిఁగిన యా మహావృక్షమునకు - కోపల్లె హనుమంత రావు
పంతులు కాండమువంటివాడు. ఆయనయే ఆ సంస్థ;
ఆ సంస్థయే ఆయనగా రూపు గాంచిన రోజులు గలవు.
జాతీయవిద్యాప్రణాళికలో భారతీయుల కవసరమైన
యంశము లన్నియుఁ జేర్చి విద్యార్థుల హృదయమునకు
వికాసమును గూర్చుటయే - ఆ సంస్థ సంకల్పము.
శిల్పము సాహిత్యము మున్నగు లలితకళలలో - ఆ సంస్థకు

౧౫


............................................................



అధ్యాపకత్వము                      16

మంచి పేరు వచ్చినది. ఎందఱో నేఁడు రాజకీయనాయకులుగా
నుండువారు - అందలి చదువులు చదివినవారే యనుట మనము
మఱువరాదు, అట్టి జాతీయవిద్యాలయములో వరదాచార్యుల వా
రొక అధ్యాపకులుగాఁ జేరిరి.

అది వారికి భృతకోపాధ్యాయపదవి కాదు. దేశీయ మహానాయకుల
సంకల్పబలము కలిమిని జన్మించిన యా సంస్థలో పని చేయుటయే
మహాభాగ్యముగాఁ దోఁచి ఆచార్యులవా రక్కడ - అధ్యాపకులైరి.
కేవలము  అధ్యాపకు లేగాక, ఆ విద్యాలయమున కాయువుపట్టుగా
నున్న వారిలో వారొకరుగా నిర్ణీతులైరి. అంతలో ఆయన విద్యా
శేముషీ వైభవములను గుర్తించి విజయనగరమునుండి
ఉద్యోగమునకాహ్వానము వచ్చెను.

విజయనగరము తెలుఁగు గడ్డలో నిజముగా విద్యానగరమే.
అక్కడ - ఆనందగజపతిమహారాజుల అండదండల వలన
సంగీతసాహిత్యములే గాక సర్వశాస్త్రములు అభ్యుదయ
మందినవి. వివిధశాస్త్రనిష్ణాతులైన పండితు లెందఱెందఱో
ఆ మహారాజు నాస్థానమున కలంకారములైరి. ఆయన
నెలకొల్పిన మహా సంస్థలలో ‘విజయనగరమహారాజ
సంస్కృతకళాశాల’ యొకటి.

ఈ సంస్థ ఇటీవలనే శతజయంతిమహోత్సవమును
మహూత్సాహముగా జరుపుకొన్నది. ముమ్మొదట ఈ
సంస్థ వేదశాస్త్ర పాఠశాలగా ఉద్భవించి ఆవల 1915 వ -
సంవత్సరమునుండి సంస్కృతకళాశాలగా అవతరించినది.

౧౬


......................................

అధ్యాపకత్వము           17

అప్పుడు దీని కధ్యక్షులుగా శ్రీమాన్ కిళాంబి
రామానుజాచార్యులవారి నెన్నుకొనిరి. యావద్భారతములో
పేరుమోసిన వైయాకరణ సార్వభౌములు - సాహిత్య
రత్నాకరులు - సకలశాస్త్రసారజ్ఞులు - మహామహోపాధ్యా
యులు తాతా సుబ్బరాయశాస్త్రివర్యులు - ఆ విద్యాలయ
మందలి పండితులలో ముఖ్యపండితులు. సంస్కృతాంధ్ర
వ్యాకరణములో సంస్కృతాంధ్రసాహిత్యములో - అద్వితీయులైన
‘కళాప్రపూర్ణులు’ వజ్ఝల చిన సీతారామస్వామిశాస్త్రులవారు -
అక్కడి తెలుఁగునకు పీఠాధిపతులు. ఆదిలో వరదాచార్యులవారు -
ఉపాధ్యక్షులుగా నిర్ణయింపఁబడినను - ఆయన ప్రజ్ఞాపాటవమును
బట్టి పరిపాలనాప్రాభవములో ‘సర్వస్వామ్యము’లాయనకే
సంక్రమించినవి.

శైశవమునుండి శ్రద్ధగాఁ దాను జదివిన చదువులకు విజయ
నగరవిద్యాలయము నికషాయమానమైనది. యావద్భారత
దేశములోని ప్రాచ్యవిద్యాలయము లన్నింటికి విజయనగర
విద్యాలయము తలమానికము. అచ్చటి యధ్యాపకులాసర్వ
శాస్త్రనిష్ణాతులైన దిగ్దంతులు. ఆ సంస్థను నిర్వహింపను
గ్రాసవాసములా కావలసినన్ని యున్నవి. విద్యలలో అపర
భోజుఁడైన విజయనగరమహారాజు కనుగలిగి చూచుచుండఁ గాఁ
గావలసిన దేముండును? తెలుఁగుగడ్డనుండియే గాక ఒరిస్సావంటి
పరిసరములనుండియు విద్యార్థు లెందఱో వత్తురు.
ఆంగ్లేయవిద్యలవలె వీని కార్థికముగా విలువ లేక పోవచ్చు.
భారతీయతత్త్వము నిరూపింపవలెనన్న - ప్రపంచ

౧౭


..................................................


అధ్యాపకత్వము               18
 

ములో భారతమున కున్న విశిష్టత గుర్తింపవలెనన్న - ఈ
చదువులే మూలకందము లనుట ముమ్మాటికి నిక్కము.
కాని ధనమే ప్రధానముగా లోక మెంచును గావున -
ప్రాచ్యవిద్యలను బోషింపవలెనన్న విద్యార్థులను బోషింపవలెను.
అన్నము పెట్టి అక్కఱయైన విద్యలు నేర్పి తమయంతవానిని
జేసి శిష్యు నింటికిఁ బంపుటయే ప్రాచీన గురువుల పద్ధతి.
వారియింటఁ గనుగలిగి మెలఁగి నిచ్చలు గురుశుశ్రూష
యేమఱక విద్యలతోపాటు వినయసంపద గడించుటయే
యప్పటి విద్యార్థివాలకము. గురువులలో దొసఁగు లేవేని
యున్నను వానిని మాటుపఱుచువాఁడు ఛాత్రుఁడఁట.
ఆయన యంతికములో నివసించి కావలసినవి నేర్చువాఁడు -
అంతేవాసియఁట. వాజ్ఞ్మయములోఁ బ్రసిద్ధములైన యిట్టి
పదము లన్నియు మన ప్రాచీనుల గురుకులాశ్రమ
విధానములను వేనోళ్ళ వెళ్ళడించును.

ఈ సంప్రదాయము లెస్సగా నెఱిఁగిన విద్వాంసులు
కావున వరదాచార్యులవా రీ యుద్యోగమునకు వచ్చిరి.
అందనుక బందరులోఁ దా నవలంబించియున్న పదవిలో
మఱొక యధ్యాపకుని నిర్ణయించి ఆయనకుఁ గావలసిన
జీతబత్తెములు తానే భరింతునని మాటయిచ్చి విజయ
నగరము చేరెను. అక్కఱ పట్టినంతవట్టు బందరులో ఆ
యుపాధ్యాయుని వరదాచార్యులే పోషించిరి.

విజయనగరములోఁ దాను జేయవలసినది కేవలము
అధ్యాపకత్వమే గాదు. విద్యాలయమున కనుబంధముగా

౧౮


.............................................


అధ్యాపకత్వము               19


‘భోజనవసతి’యుఁ గలదు. మహారాజపోషణలో నున్నది
కావున వస్తువాహనములకుఁ దఱుగు లేదు. కాని యాజ
మాన్యలోపమునుబట్టి యా సంస్థల పరమార్థమే దూరము
కావచ్చును. వెట్టిగ నేదో యింత వెట్టి చదువులు చెప్పినను
ఫలితము దక్కదు. ఈ రహస్యము వరదాచార్యులవా రెఱింగి
విద్యాలయ మొక కంటను భోజనాలయ మొక కంటను
గనిపెట్టి యుండిరి. ఆరోగ్యభాగ్య మున్ననాఁడే చదువుసంధ్యలు
చక్కఁగా సాగును. పుష్టి లేని తిండి పెట్టిన నాఁడు  వానికిఁ
జదువులు ఒంటఁబట్టులోఁగా రోగము లంటి ఆపై యొంటిని
జీర్ణింపవచ్చును. రోగములు కాఁపురమున్న విద్యార్థి, విద్యాధికుఁ
డయ్యు లోకమున కేమి చేయఁగలడు? అప్పుడు విజయ
నగరములో విశేషమైన జబ్బు లున్నవని దేశములో
వదంతి కలదు. దూరదేశమునుండి వచ్చియు రోగములకు
జంకి ‘పరారి’ యైన విద్యార్థులును  గలరు. ఈ దశలోఁ
జేయవలసిన పని యెంతో గలదని వరదాచార్యులవారికిఁ
దోచెను. శాకపాకములలోఁ దఱుగులు వచ్చెనేని - ఈ పిల్ల
లేమైపోదురన్న బెంగ ఆయన కుండెడిది. తానుగా నిచ్చలు
సహస్రాక్షుఁడై యా సత్రమును గనిపెట్టి యుండి వంటలో
దొసఁగులు పొసఁగకుండఁ గాపాడును. ఇరుపూటఁ దానుగాఁ
బరీక్షించినఁగాని విద్యార్థులకు భోజనము పెట్టరాదని
కట్టడ చేసెను. తనయింటఁ దన యావులపాలు పోసి  పేద
సాదులగు విద్యార్థుల పథ్యపానములు చూచును,

౧౯


..................................


అధ్యాపకత్వము                     20

ఆ పట్టణములో అధ్యాపకుఁడుగాఁ దనకు వచ్చు రెండువందల
రూప్యములను - ఎప్పటికప్పుడే పేదవిద్యార్థుల యక్కఱలకుఁ
గర్చువెట్టును. తన గ్రాసవాసములకుఁ గావలసిన దంతయు
స్వగ్రామమునుండి రావలసినదే. విద్యార్థిదశలోనే వితరణ
శాలియని మదరాసులో పేరు వొందిన వరదాచార్యులవారు
విద్యాధికులై విజయనగరములో విశిష్టత గాంచుటలో విశేష
మేమున్నది ?

వివిధప్రదేశములనుండి వచ్చిన విద్యార్థులమనస్తత్త్వములో
వైవిధ్య ముండును. తన యింటిపరిస్థితి సర్వము మఱచి
చదువులు ముదిరినకొలఁదియుఁ దత్త్వములో మార్పు
పొందువారు కొందఱు. హృద్యమైన విద్యతోపాటు వినయ
సంపద సంపాదించుకొని రాణించువారు కొందఱు. విద్యా
గంధముతోపాటు గర్వగంధము పెరిఁగి ప్రవర్తించువారు
కొందఱు. ఇంటను బయటను దమ శిష్యుల నొకకంటఁ
గనిపెట్టి యుండవలెనని వరదాచార్యులవారి దీక్ష.
మహోద్దండులైన పండితోత్తములయ్యు కళాశాలోఁదమ
తమ విధ్యుక్తముల నెట్లు నిర్వహించుచుందురో వారి
పాండిత్యప్రతిభలు పిల్లల కెట్లు -అక్కఱకు వచ్చుచున్నవో
వేఱొకకంట సమీక్షింపవలెను. ప్రాచ్యవిద్యలోని మెఱుఁగులు
క్షుణ్ణముగా గ్రహించిన విదేశీవిద్వాంసులు వ్రాసిపెట్టిన
చక్కని విమర్శనాభాగములను సంస్కృతవిద్యార్థులకుఁ
దానుగా బోధింపవలెను. తన కత్యంతము ప్రాణప్రదమైన
గీర్వాణములో ఉద్గ్రంథములను గొన్నిటిని పాఠము చెప్ప

౨౦
................................................



   అధ్యాపకత్వము                                      21

వలెను. కళాశాలాపరిపాలనను బోధనాభాగము - ఒక
యెత్తుగా విద్యార్థుల మేలుగీళ్ళరయుట యొక యెత్తుగా
వరదాచార్యులవారు భావింతురు. విద్యార్థిజీవితములో
విద్యాభ్యాసదీక్ష - సత్ప్రవర్తనాకాంక్ష పడుగుపేకలవంటివని
యాచార్యులవారి నిర్ణయము. ఎన్ని చదువులు చదివినను
నీతి లేనివారు వాసన లేని పూవులే. మొదలు - విద్యకు
జ్ఞానసంపాదనమని యర్థమున్నను - అయ్యది నేఁడు మృగ్యమే
యగుచున్నది. చదువులు చదివిన వా రెల్లరు వివేకవంతు
లగుటలేదు. వివేకమును బోషించు చదువే చదువు- అని
ప్రాచీనుల మాట. అది నేఁ డాచరణలో అదృశ్యమై
పోయినది. ఇరువదినాలుగు గంటలలోను - ఏ యయిదాఱు
గంటలో నేఁటి విద్యార్థి గురువుల సన్నిధిలో కాలము గడ
పును. తక్కినవేళలలో వాఁ డేమి చేయునో వానివైఖరి
యెట్టిదయ్యెనో పట్టించుకొనువారే కన్పట్టరు. సర్వకాల
సర్వావస్థలలో గురుశిష్యుల కనుస్యూతమైన సంబంధ
ముండుటఁజేసి గురుకులవాసములోని విలువ ప్రాచీనులు
గుర్తించిరి. కాలపరిస్థితినబట్టి యా కట్టుపాటులు మాఱినను
విజయనగరసంస్కృతకళాశాలలో - ఆ ప్రాచీనసంప్రదాయ
మును గొంతకుఁగొంత సుకుమారముగ వరదాచార్యుల
వారు పాటించిరి.

కళాశాలలో గురువులు చెప్పిన పాఠములు విద్యార్ఠి
చింతన చేయుచుండెనో లేదో, గ్రాసవాసములకు వీసమేని
లోపము లేదుగాన పోనీ! యని యేదో రీతిగ విద్యార్ఠి కాల

౨౧


...............................................


   అధ్యాపకత్వము                           22

క్షేపము చేయుచుండెనేమో! నిచ్చలు - అట్టివారి యంటు
సొంటు లుండుటఁజేసి తక్కిన ‘యర్భకులు’కొందఱు తలక్రిందు
లగుచుందురేమో! గోటితో గిల్లివేయవలసిన ఘట్టమును
జూచియుఁజూడకున్నచొ గొడ్డలియే కావలసివచ్చును.
తాత్కాలికముగ అప్రియమైనను శ్రేయోభిలాషియైనవాఁడు
హితమునే పలుకవలెను.

రేయి పదింటికి ‘వసతి’ గృహములో విద్యార్థి యేమి
చేయునో యేమి చదువునో వరదాచార్యులవారు వెళ్ళి
చూతురు. వాండ్రు గుములుగట్టి తలుపులు గట్టిగా బిడా
యించి చక్కఁగా - పేకాటలో మినిగిన రోజులు గలవు.
అదే వేళలో - ఆచార్యులవారు వెళ్ళి తలుపు తట్టఁగా ఆతఁ
డెవ్వఁడో సహాధ్యాయుఁడే గదా యని యాలకింపకపోఁగా
‘గీర్వాణము’చూపిన ఘట్టములు కలవఁట. నెమ్మదిగాఁ దలు
పులు దీయించి గడగడ వడఁకుచున్న యా కుఱ్ఱలను ముసి
ముసినవ్వులతో మందలించి దారికిఁ దెచ్చిన పద్ధతులు కలవు.
ఎవ్వఁడేని విద్యార్థి భోజనమునకు రానిచో దాని కారణ
మాచార్యులవారికిఁ దెలిసితీఱవలెను. ఏదేని యస్వస్థత విద్యా
ర్థికిఁ గన్పించెనేని తానుగాఁ బోయి మందుమాఁకు లిప్పించి
పథ్యపానములు చూచును. అతని కారోగ్యము దొరకి పాఠ
ములు వినఁగలుగునందాఁక - ఆయన పరామరిక యుండి
తీఱును. ఊరిలోఁ బనికిరాని చవుకపాఱు శాకములు తెచ్చి
కూరనారలు వండి పిల్లలకుఁ బెట్టినచో ముందుగా బాధపడు
నది విద్యార్థులు కాదు; ఆ బాధలోఁ దొలిపాలు - ఆచార్యుల

౨౨
.................................


  అధ్యాపకత్వము                                        23

వారిదే. ఆయన‘సమీక్షలో’ సర్వము వండినప్పుడే - ఆయనకు
సంతర్పణము; ఆ బిడ్డ లా తిండి తిని యా చదువులలో
మునిఁగినప్పుడే - ఆయనకు పరమానందము. అల్లారుముద్దుగాఁ
బెరిఁగియుఁ దల్లిదండ్రులను విడిచి దూరదేశమునకు వచ్చి
విజయనగరాధీశునిదరిఁ జేరిన యా కుఱ్ఱలకు - ఈ ‘పూజారులు’
వర మేల యీయరని యాచార్యులవారి దీక్ష. వలసినవారి
కెల్లరకుఁ దానుగా వలువలు విలిచి యిచ్చి - అక్కఱయైన
సదుపాయములు చక్కఁగాఁ జేసి చూపి - భోజనభాజన
‘వసతుల’ను మురిపముతో నేరుపఱిచి - ఆధివ్యాధులు కలుగక
కుండఁ గంటికి రెప్పవోలెఁ గాపాడుచున్న వరదాచార్యులవారు
విద్యార్థిబృందమునకుఁ దల్లిదండ్రులే గాదు; కల్పవృక్షమే
యన్నను - అతిశయోక్తి కాదు.

ఆడంబరము కోసమై తెచ్చిపెట్టుకొన్నవి యేవియేనియు
నిముషములోఁ దెలిసిపోవును. సహజముగఁ బుట్టినవే నాలుగు
కాలములపాటు నిలిచియుండును. మాటలలో - ఆచార్యుల
వారు మితభాషులు. ఆడంబరమైన పలుకుగాని - అర్థము లేని
పనులుగాని - ఆయనకు గిట్టవు. విద్యార్థులను దాను హృదయ
పూర్వకముగఁ బ్రేమించినను బ్రేమించినట్లు నటింపడు.
‘క్రియా కేవల ముత్తర’మ్మను తత్త్వమే ఆయన తత్త్వము.
స్వార్థము - ఏ కోశములోను లేశమేని యెఱుంగక నిత్యము
విద్యార్థుల యోగక్షేమమునకే దీక్షగాఁ బనిచేసిన వరదా
చార్యులవారిని విజయనగరములో గారవింపనివారు లేరు.
నానాదేశాగతులైన విద్యార్థు లాయన సన్నిదానములోఁ

౨౩
..........................................................


అధ్యాపకత్వము                  24

జదువులు చదివి యారితేఱినవెనుక తమతమ జీవితములలో-
ఆయనను మఱచిపోయినవారు లేరు. విజయనగరభూపాలుఁడు
విద్యలకై చేసిన సదుపాయములను అందఱును చక్కఁగా
పొందుటకై యాచార్యులవారు చేసిన నిరంతరకృషిని - ఆ
పట్టణములో మెచ్చనివారును లేరు. అధికారులు - అనధికారు
లాయనకు బ్రహ్మరథమే పట్టిరి. ఆ విద్యాసంస్థలో సర్వతో
ముఖముగ - ఆయన యేర్పఱిచిన బాట రాచబాటయై భావి
కాలములో సైతము మిక్కిలిగా రాణించెను.








౨౪